పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై పలువురు ప్రతిపక్ష నేతలు మరోమారు కేంద్రంపై విమర్శల దాడి చేశారు. మహమ్మారిని ఒక సాకుగా చూపి.. ప్రశ్నించే గొంతుకను అణచివేసేందుకు చేసిన ప్రయత్నమేనని ఆరోపించారు.
కేంద్రంపై మరోమారు మండిపడింది కాంగ్రెస్. ప్రశ్నోత్తరాల రద్దు నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం, పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. పార్లమెంటు లోపల, బయట ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు.
భయానక చిత్రం..
ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయటంపై విమర్శలు గుప్పించారు బహుజన సమాజ్ పార్టీ లోక్‌సభ ఎంపీ కున్వర్ దనీశ్ అలీ. 'ఎవరైనా ట్వీట్ చేస్తే అది ధిక్కారం, నేరుగా ప్రశ్నిస్తే అది రాజద్రోహం. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు మిగిలి ఉన్న ఒకే ఒక్క అవకాశం పార్లమెంటు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆ అవకాశాన్నీ ప్రభుత్వ దూరం చేసింది. సరికొత్త భారత్‌లో ఇది భయానక చిత్రం' అని పేర్కొన్నారు.
ఒక సాకు..
ప్రజాస్వామ్య హక్కులను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు అఖిల భారత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధినేత బద్రుద్దీన్ అజ్మల్. కీలకమైన అంశాల్లో ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు. 'మహమ్మారి అనేది ఒక సాకు, మన గొంతును అణచివేడమే అసలు ఉద్దేశం, తద్వారా జాతీయ సమస్యలపై ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు.' అని ట్వీట్ చేశారు.
కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చావన్. కరోనా సాకుతో ప్రధాని మోదీ.. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. కానీ, వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో వారం వారం ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: 'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'