భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మానవసహిత మిషన్ గగన్యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలపై చంద్రయాన్-2 ప్రభావం ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. ప్రణాళిక ప్రకారమే 2022లో గగన్యాన్ ప్రయోగం ఉంటుందని ఇస్రో అధికారి తెలిపారు.
చంద్రయాన్, గగన్యాన్ లక్ష్యాలు వేరువేరని భూ పర్యవేక్షణ-విపత్తు నిర్వహణ విభాగ డైరెక్టర్ పీజీ దివాకర్ వెల్లడించారు.
"అసలు సమస్యే ఉండదు. ఇతర ప్రయోగాలపై చంద్రయాన్-2 ప్రభావం ఉండదు. ఉపగ్రహాల ప్రయోగంతో పాటు గగన్యాన్ మిషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. ప్రతి మిషన్ ఎంతో ప్రత్యేకమైనది."
--- పీజీ దివాకర్, ఇస్రో అధికారి.
2022 కల్లా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత తొలి సౌర మిషన్ 'ఆదిత్య ఎల్-1'ను వచ్చే ఏడాది ఇస్రో ప్రయోగించనుంది.
వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి.. సురక్షితంగా భూమికి తీసుకురావడమే ఈ గగన్యాన్ ముఖ్య లక్ష్యం.
ఇదీ చూడండి- 'విక్రమ్' కోసం మరో 14 రోజులు అన్వేషణ : శివన్