రఫేల్ ఒప్పందం అనంతరం అనిల్ అంబానీ సంస్థకు భారీగా పన్ను మినహాయింపు లభించిందన్న వార్తలను ఫ్రాన్స్ ఖండించింది. ఫ్రాన్స్‌లోని అనిల్ అంబానీ సంస్థకు పన్ను మినహాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
" ఆదాయపన్ను శాఖ నిబంధనలకు, చట్టాలకు లోబడి రిలయన్స్ ఫ్లాగ్ సంస్థకు పన్ను మినహాయింపు కల్పించాం. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు." - ఫ్రాన్స్ రాయబారి కార్యాలయం.
2015లో ఫ్రాన్స్‌లోని అనిల్ అంబానీ రిలయన్స్ ఫ్లాగ్ సంస్థకు 143.7 మిలియన్ యూరోల పన్ను మినహాయింపు లభించినట్లు 'లీ మాండే' అనే పత్రిక కథనం ప్రచురించింది. భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని నెలల అనంతరం పన్ను మినహాయింపు పొందినట్లు పేర్కొంది.
ఫ్రెంచ్ పత్రిక చెప్పిందేమిటీ....
2007-10 వ్యవధిలో ఫ్రాన్స్‌లోని అనిల్ అంబానీ సంస్థ సుమారు 60 మిలియన్ యూరోలు కట్టాలని ఆ దేశ ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ధరించినట్లు లీ మాండే పత్రిక పేర్కొంది. పన్ను వివాద పరిష్కారంలో భాగంగా రిలయన్స్ సంస్థ 7.6 మిలియన్ యూరోలు చెల్లిస్తామని ప్రతిపాదించిందిందని తెలిపింది.
2010-12 కాలానికి అదనంగా 91 మిలియన్ యూరోలు చెల్లించాలని అధికారులు మరోమారు ఆదేశించారు. మొత్తం 151 మిలియన్ యూరోలు చెల్లించాలని ఏప్రిల్ 2015లో రిలయన్స్‌ను ఆదాయపుపన్ను శాఖ ఆదేశించింది. రఫేల్ ఒప్పందంపై మోదీ ప్రకటన చేసిన ఆరు నెలల అనంతరం అక్టోబర్‌లో ఫ్రెంచ్ అధికారులు రిలయన్స్ సంస్థ 7.3 మిలియన్ యూరోలు చెల్లించేందుకు అంగీకరించారని పేర్కొంది.
ఇదీ చూడండీ: 'విలీనం'పై వివాదంలో సవాళ్ల పర్వం