జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు నమోదు కాలేదని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కశ్మీర్ లోయలో నెమ్మదిగా జనజీవనం సాధారణ స్థితికి చేరుతోందని స్పష్టం చేశారు.
"కశ్మీర్‌లోయలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు...జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. ప్రజలు సహకరిస్తున్నారు. జమ్ము ప్రాంతంలో ఎలాంటి సంఘటన జరగలేదు. ఆదివారం కొన్ని వదంతులు వ్యాపించాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఎలాంటి వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం తరఫున ప్రజలకు విన్నవిస్తున్నాం."
-సయీద్ సెరిష్ అస్గర్, సమాచార ప్రజా సంబంధాల అధికారిణి
సోమవారం చాలా ప్రాంతాల్లో ఆంక్షల ఎత్తివేత, సడలింపు చేపట్టామని కశ్మీర్ సెంట్రల్ డీఐజీ వీకే బిర్ది వెల్లడించారు. అక్కడక్కడా రాళ్లదాడి జరిగిందని... చట్టానికి అనుగుణంగా నిందితులతో వ్యవహరిస్తామని వెల్లడించారు.
మోగిన బడి గంట...
సోమవారమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలు ప్రారంభం కాగా.... ప్రైవేటు బడుల మూసివేత కొనసాగింది. భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పిల్లలను స్కూలుకు పంపించడం ఆందోళనకరంగా ఉందని పలువురు తల్లిదండ్రులు వాపోయారు.
వైద్యానికి ఇబ్బంది...
కశ్మీర్ ప్రజలు మందుల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించిన కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సరుకు రవాణా నిలిచిపోయింది. ఈ కారణంగా వైద్య సామగ్రి తరలింపునకు ఇబ్బంది కలిగింది. 14 రోజులుగా కశ్మీర్‌లోయలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రవాణా, సమాచార సేవలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: నేరగాళ్లకు వింజామరలు