కరోనాతో మృతి చెందినవారి దేహాలకు శవ పరీక్ష చేస్తున్నప్పుడు హానికరమైన పద్ధతులను అవలంబించకూడదని సూచించింది భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్). ఈ సమయంలో అవయవ ద్రవాలు, స్రావాల వల్ల వైద్యులు, మార్చురీ సిబ్బందికి ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
'స్టాండర్డ్ గైడ్లైన్స్ ఫర్ మెడికో లీగల్ అటాప్సీ' పేరుతో ఐసీఎంఆర్ తుది నివేదిక విడుదల చేసింది. ఇందులో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సంభవించిన మరణాలను 'నాన్ మెడికో లీగల్ కేసులు' గా పరిగణించాలని.. వాటికి శవ పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది. చికిత్స అందించిన వైద్యుడు ధ్రువీకరిస్తే సరిపోతుందని వెల్లడించింది.
అనుమానాస్పద కేసుల్లో...
కరోనాతో మరణించినట్లు అనుమానమున్న కొన్ని కేసులను 'మెడికో లీగల్ కేసులు'గా పరిగణించి.. మృతదేహాలను మార్చురీకి పంపిస్తారు. పోలీసులకు సమాచారం అందించిన అనంతరం.. చనిపోవడానికి కారణమేంటనే స్పష్టత కోసం శవ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా అవసరం లేని కేసుల్లో శవ పరీక్షలు నిర్వహించకుండా పోలీసు అధికార యంత్రాంగం ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించింది ఐసీఎంఆర్ .
కరోనా నిర్ధరణ ఫలితాలు రాకపోతే ఏం చెయ్యాలి?
కొవిడ్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న మృతదేహాలను మార్చురీ నుంచి బయటకు పంపించకూడదని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు జారీ చేసింది. లాంఛనాల తర్వాత శవాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని పేర్కొంది.
మార్గదర్శకాలు ఇవే..
- శవం నుంచి ప్రమాదం లేకుండా.. సమర్థమైన ప్లాస్టిక్ బాడీ బ్యాగ్లో ప్యాక్ చేయాలి.
- మృతదేహాన్ని మార్చురీకి తరలించే సమయంలో పీపీఈ కిట్లను కచ్చితంగా ఉపయోగించాలి.
- ఏ సమయంలోనైనా మృతులకు చెందిన ఇద్దరు బంధువులు పక్కనే ఉండాలి.
- మృత దేహానికి మీటరు దూరం పాటించాలి.
- పోలీసుల సమక్షంలో శవాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ తెరవకుండానే బంధువులు గుర్తించాలి.
- వారి ఆధ్వర్యంలోనే ఐదుగురు బంధువుల కంటే ఎక్కువ మంది రాకుండా.. శవానికి అంత్యక్రియలు జరపాలి.
- మృతుల కుటుంబ సభ్యులకు రోగ లక్షణాలు ఉండే అవకాశం ఉంది కనుక.. భౌతిక దూరం పాటించాలి.
- మార్చురీలో కరోనా సోకిన మృతదేహాలను, సాధారణ మరణాలు సంభవించిన శవాలను విడిగా ఉంచాలి.
- శరీరాన్ని విద్యుత్ పరికరాలతో దహనం చేయాలి.
- అంత్యక్రియల్లో భాగంగా మృతదేహాన్ని తాకి నిర్వహించే మతపరమైన ఆచారాలు నిషేధం. బూడిద ఎటువంటి ప్రమాదం కాదు కాబట్టి.. కర్మకాండలు చేసుకోవచ్చు.