కరోనా వైరస్‌కు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. చైనాలోని వుహాన్‌లోనే వైరస్ ఉద్భవించిందని స్పష్టం చేశారు. ఆ దేశం చెబుతున్నట్లు వుహాన్‌తో పాటే ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఒకే సమయంలో కరోనా కేసులు నమోదయ్యాయని ధ్రువీకరించేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
సామాజిక మాధ్యమాల్లోని తన అనుచరులతో 'సండే సంవాద్' చర్చా కార్యక్రమం 6వ ఎపిసోడ్లో పాల్గొన్నారు హర్షవర్ధన్. ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
సామూహిక వ్యాప్తి లేదు..
దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి. పలు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు మాత్రమే ఇది పరిమితమైందని చెప్పారు. బంగాల్లో సామూహిక వ్యాప్తి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పిన విషయంపై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బంగాల్ సహా జనసాంద్రత అధికంగా ఉండే కొన్ని జిల్లాల్లోనే వైరస్ సామూహిక వ్యాప్తి ఉందన్నారు. అయితే దేశవ్యాప్తంగా మాత్రం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.
భారత్‌లో కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు గుర్తించలేదని హర్షవర్ధన్ చెప్పారు. వైరస్ వ్యాప్తి సామర్థ్యం పెరగడం, ప్రమాద తీవ్రత అధికమవడం వంటి విషయాలకు సంబంధించిన ఆధారాలు లేవన్నారు.