ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. లోయలో ఒక్క బుల్లెట్‌కూడా పేలలేదని, ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని తెలిపారు.
ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ దిల్లీలో నిర్వహించిన సదస్సులో అమిత్‌షా ప్రసంగించారు. సమగ్రమైన జాతీయ భద్రతా విధానాన్ని అమలు చేయడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
"మొదటిసారి లక్షిత దాడులు చేసినప్పుడు అబద్ధమని కొంతమంది కొట్టిపారేశారు. ఇది మన విధానం కాదని వాదించారు. ఎప్పుడైతే వైమానిక దాడులు చేశామో ఇక వాళ్లే చెప్పాల్సి వచ్చింది.... 'ఇదే భారతదేశ కొత్త విధానమని'. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. మన దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించనివ్వం. మన సైనికుల ఒక్క రక్తపు చుక్క కూడా వృథా కానివ్వం. లక్షిత, వైమానిక దాడుల తర్వాత ప్రపంచ దేశాలు భారత్‌ను చూసే దృక్పథం మారింది. భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది."
-అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఇదీ చూడండి: నాడు ఉద్యమ వ్యూహాల నిలయం- నేడు శాంతి కుటీరం