జులై 31 నాటికి దిల్లీలో 5.5 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని అంచనా వేశారు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. అయితే దిల్లీలో సామాజిక వ్యాప్తి లేదని.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన డీడీఎమ్ఏ(దిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ)తో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు సిసోడియా.
కరోనా బాధితుల కోసం జులై చివరి నాటికి దిల్లీలోని ఆసుపత్రుల్లో కనీసం 80వేల పడకలు అవసరమవుతాయని సిసోడియా వెల్లడించారు. ఈ నెల 15 నాటికి 44వేల కేసులు నమోదయ్యే అవకాశముందని, ఆసుపత్రుల్లో కనీసం 6,600 పడకలు ఉండాలని పేర్కొన్నారు.
"ఈ నెల 30 నాటికి దిల్లీలో కరోనా కేసులు లక్ష మార్కును అందుకుంటాయి. ఆసుపత్రుల్లో 15 వేల పడకలు అవసరం ఉంటాయి. జులై 15 నాటికి 2.15 లక్షలు, జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా. అప్పటికి 88 వేల పడకలు అవసరం. కానీ రానున్న రోజుల్లో కేసులు పెరిగితే.. సరిపడా పడకలు అందుబాటులో ఉంటాయా? లేదా? అనే ప్రశ్నకు.. సమావేశానికి హాజరైన ఎవరి వద్దా సమాధానం లేదు."
-- మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి.
అసుపత్రులను దిల్లీవాసలుకు మాత్రమే అందుబాటులో ఉంచాలని దిల్లీ కేబినెట్ నిర్ణయించిందని... కానీ అందుకు విరుద్ధంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు ఉపముఖ్యమంత్రి. తన ఆదేశాలను ఎల్జీ ఉపసహరించుకునే యోచనలో లేరని సమావేశం అనంతరం సిసోడియా తెలిపారు. అందువల్ల.. దిల్లీ ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా వైద్య సేవలు అందించడానికి సన్నద్ధమవుతున్నట్టు వివరించారు.
'ఎలా వస్తోందో తెలియట్లేదు...'
తాజాగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా బాధితులకు అసలు వైరస్ ఎలా సోకిందో తెలియడం లేదని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. వ్యాధి మూలలను గుర్తించలేకపోతున్నామన్నారు.
దిల్లీలో సోమవారం 1,007కేసులు నమోదయ్యాయి. ఫలితంగా నగరంలో కేసుల సంఖ్య 29వేలు దాటింది. 874మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- సీఎం నమూనాల సేకరణ.. బుధవారం రిజల్ట్