కరోనా తీవ్రత దేశమంతటా కనిపిస్తున్నా గోవాలో ఇప్పుడు(బుధవారం నాటికి) కేసులేమీ లేవు. మార్చి 25 - ఏప్రిల్ 3 మధ్య ఇక్కడ ఏడుగురికి వైరస్ సోకింది. వారందరికీ సత్వర చికిత్సలు అందించి ఏప్రిల్ 19 నాటికి డిశ్ఛార్జి చేశారు. తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనాను కట్టడి చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది కృషి, ప్రజల సహకారం కీలకం. ప్రపంచమంతటా కరోనా కమ్మేస్తున్నట్లు వార్తలొచ్చిన వెంటనే గోవా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణేలు వెంటనే చర్యలకు ఉపక్రమించారు.
ఓ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజలను చైతన్యపరిచారు. గోవాలో అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులను విమానాశ్రయం వద్దే ఆపివేసి పరీక్షించారు. అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించారు. స్వతహాగా డాక్టర్ అయిన ముఖ్యమంత్రి సావంత్ తన పుట్టినరోజున మపుసాలోని ఆసుపత్రికి వెళ్లి రోగులను పరీక్షించారు. ఇది వైద్య సిబ్బందిలో మరింత స్ఫూర్తిని నింపింది. ప్రాథమిక పరీక్షల కోసం 1000 థర్మల్ స్కానింగ్ యంత్రాలను కొనుగోలు చేసింది. గోవాలో చిక్కుకుపోయిన 6 వేల మందికి పైగా విదేశీయులను ప్రత్యేక విమానంలో వారి స్వస్థలాలకు పంపించింది.
- కరోనా వ్యాప్తి చెందుతున్న సమయానికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం ప్రజలు గుమిగూడకుండా కట్టుదిట్టమైన నిబంధనలను చేపట్టింది.
- మార్చి 22న ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభించడం వల్ల గోవా ప్రభుత్వం దీన్ని మరో 3రోజులు పొడిగించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసింది.
- గోవాకు కర్ణాటక, మహారాష్ట్రలతో సరిహద్దులున్నాయి. నిత్యావసరాలు ఈ రాష్ట్రాల నుంచే వస్తుంటాయి. లాక్‌డౌన్ సమయంలో గోవా రెండు రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేసింది.
- త్వరితగతిన వైరాలజీ ల్యాబ్‌ను ప్రారంభించింది. అంతకుముందు ఇక్కడి నుంచి నమూనాలను పుణేలోని ల్యాబ్‌కు పంపించి ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చేది. ఈ సమయాన్ని తగ్గించి, సత్వర వైద్యం అందించేందుకు వైరాలజీ ల్యాబ్ ఉపయోగపడింది.
కరోనాపై ఆగని పోరు
మా కరోనా పోరాటయోధుల కృషి, రాష్ట్ర ప్రజల సహకారంతో గోవాను భారత ప్రభుత్వం ‘గ్రీన్‌జోన్’గా గుర్తించింది. శానిటైజేషన్, మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం కావడం వంటి చర్యలతో వైరస్‌పై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
- ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
ప్రజారోగ్యంపై సర్వే
- లాక్‌డౌన్ సమయంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సర్వే జరిపి నివేదిక తెప్పించుకుని తదనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది.
- 200కు పైగా ప్రాంతాలను శానిటైజ్ చేయించింది.
- దేశంలోనే తొలిసారిగా కొబోట్-19 పేరుతో వాట్సాప్‌లో ప్రజలకు హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- ఓ అమెరికా కంపెనీ సహకారంతో ‘టెస్ట్ యువర్‌సెల్ఫ్ గోవా’ యాప్‌నూ రూపొందించింది.