నిర్భయ దోషి ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి కేవలం నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోవటం దేశ చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. దిల్లీ సామూహిక అత్యాచారం కేసులో దోషులైన నలుగురిలో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ పట్ల అధికార వర్గాలు చురుకుగా స్పందించాయి. ముకేశ్‌ను మిగిలిన ముగ్గురితో సహా జనవరి 22న ఉరితీయాలని న్యాయస్థానం తొలుత ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ముకేశ్ సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశాడు.
కౌంట్‌డౌన్ మొదలు...
- తన క్యురేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణకు గురవటం వల్ల ముకేశ్ సింగ్ మంగళవారం (14.01.2020) క్షమాభిక్షకు దరఖాస్తు చేశాడు.
- బుధవారం (15.01.2020) మధ్యాహ్నానికల్లా దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వం తరఫున నిరాకరణను ప్రకటించారు.
- తదనంతరం వ్యవహారం హోంమంత్రి అమిత్ షా ముందుకు వచ్చిన 24 గంటల్లోగానే (గురువారం..16.01.2020) రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఫైలుపై సంతకం చేశారు.
- గురువారం సాయంత్రానికి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరిశీలనకు వచ్చింది.
- శుక్రవారం (17.01.2020) ఉదయానికల్లా తన తిరస్కరణ నిర్ణయాన్ని రాష్ట్రపతి హోంశాఖకు తెలియజేశారు.
ఎలా నిర్ణయిస్తారు?
క్షమాభిక్ష విన్నపం పరిశీలన సందర్భంగా అనేక అంశాలను, మార్గదర్శకాలను పాటిస్తామని హోంశాఖ తెలిపింది. ఈ అంశాలను పరిశీలిస్తారు.
- నిందితుడి వయసు, మానసిక స్థితి, స్త్రీయా- పురుషుడా వంటి వ్యక్తిగత విషయాలు
- ఆ నేరం చేయటానికి దోహదం చేసిన లేదా కారణమైన పరిస్థితులు
- సాక్ష్యంపై అప్పిలేట్ కోర్టు అనుమానాలు
- విచారణ ఫలితంగా లభించిన కొత్త సాక్ష్యాల పరిగణన
- సెషన్స్ జడ్జి విధించిన శిక్షను హైకోర్టు సమర్థించడం లేదా తిరస్కరించిన సందర్భం
- ఇద్దరు సభ్యుల హైకోర్టు బెంచి న్యాయమూర్తులు విభేదించి మూడవ జడ్జి ప్రమేయం అవసరమైన సందర్భం
- సామూహిక హత్య కేసుల్లో నిందితుల నిర్ధరణలో ఆధారాల గణన
- కేసు పరిశోధన, విచారణలలో సుదీర్ఘమైన ఆలస్యం చోటుచేసుకోవటం... తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని క్షమాభిక్ష ఇవ్వాలా.. వద్దా అన్న నిర్ణయం వెలువడుతుంది.
గత 40 ఏళ్లలో క్షమాభిక్ష నిర్ణయం అతి త్వరగా వెలువడటంలో 1996లో రాజస్థాన్ రైతు రాంచందర్ పిటిషన్‌కు సంబంధించి 42 రోజులు రికార్డు ఉండేది. కాగా ఉగ్రవాది అజ్మల్ కసబ్ క్షమాభిక్ష అర్థించిన 54 రోజుల్లోగా నిర్ణయం వెలువడటం రెండవది. ప్రస్తుతం ఈ రికార్డు నాలుగు రోజుల్లో పూర్తైన ముకేశ్ క్షమాభిక్ష దరఖాస్తు పేరిట నెలకొంది. ఈ విధంగా సత్వర నిర్ణయాలు వెలువడటం వల్ల తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో పెంపొందుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.