నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ వినతిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.
దిల్లీ హైకోర్టు విధించిన స్టే కారణంగా దోషులకు మరణశిక్ష అమలు చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్. దోషుల రివ్యూ పిటిషన్లతోపాటు ముగ్గురికి సంబంధించిన క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లూ తిరస్కరణకు గురైనా.. జైలు అధికారులు వారికి ఉరి అమలు చేయలేకపోతున్నారని నటరాజన్ కోర్టుకు విన్నవించారు.
ఇదీ జరిగిందీ..
మిగిలిన న్యాయ ప్రక్రియలను ఉపయోగించుకునేందుకు అవకాశమివ్వాలన్న దోషుల అభ్యర్థనపై వారంపాటు సమయమిస్తూ దిల్లీ హైకోర్టు ఉరిపై స్టే విధించింది. ఏడు రోజుల్లో నిందితులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకుంటే చట్టపరంగా ముందుకెళతామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేయాలని దిల్లీ కోర్టులో తిహార్ జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిందితులు సమాధానమివ్వాలని దోషులకు సూచించింది కోర్టు.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టుకు తిహార్ అధికారులు