పండుగ సీజన్, శీతాకాలంలో ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. ప్రజలంతా నిబంధనలు పాటిస్తే కరోనాపై పోరులో భారత్ మెరుగైన స్థితిలో ఉంటుందని తెలిపారు. కొవిడ్ సన్నద్ధతపై ఆరోగ్య, వైద్యవిద్య శాఖల మంత్రులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. భారత్లో కరోనా గతిని నిర్ణయించేందుకు వచ్చే మూడు నెలలు నిర్ణయాత్మకమైనవని చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో మాస్కులు, ఫేస్ కవర్లు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వల్లే.. వైరస్ను కట్టడి చేయగలిగినట్లు హర్షవర్ధన్ తెలిపారు. గడిచిన మూడు నెలల్లో దేశంలో కొవిడ్ ప్రభావం తగ్గినట్లు పేర్కొన్నారు.
"ఒకప్పుడు రోజుకు 95వేల కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు వాటి సంఖ్య 55వేలకే పరిమితమైంది. రికవరీ రేటు 90శాతానికి దగ్గరలో ఉంది. కొవిడ్ మరణాలు రేటు 1.51శాతంగా ఉంది. దీన్ని ఒక్క శాతంలోపునకు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. యాక్టివ్ కేసుల సంఖ్య 7లక్షల లోపే ఉంది. కేసుల రెట్టింపు సమయం 97.2 రోజులకు పెరిగింది. ఒక్క ల్యాబ్ నుంచి 200 ల్యాబ్లను ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాం."
-హర్షవర్ధన్, ఆరోగ్య మంత్రి.