వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టి దాని వినియోగాన్ని పెంపొందించేలా కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో వ్యవసాయ పరిశోధన, విస్తరణ విద్య పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలకు గాను స్టార్టప్‌లను, వ్యవసాయ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులకు ఏ రకం పంటకు ఎంత మేర డిమాండ్ ఉందో తెలుసుకునేందుకు సమాచార సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. భారత్‌లోని సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానం పట్ల గర్వంగా ఉందన్న ప్రధాని.... సేంద్రీయ, సహజ సిద్ధ వ్యవసాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలు, సజ్జలు, రాగులతోపాటు ఇతర చిరుధాన్యాలను ఆహారంలో భాగస్వామ్యం చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని మోదీ అభిప్రాయపడ్డారు.