భారత్, చైనా మధ్య చెన్నై బంధంతో నూతన శకం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడు కోవలంలోని 'తాజ్ రిసార్ట్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్' హోటల్ వేదికగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ బృందంతో సమావేశమయ్యారు ప్రధాని. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు జరిపారు.
గతేడాది తన వుహాన్ పర్యటన అనంతరం భారత్, చైనా మధ్య సమాచార మార్పిడిలో పరస్పర సహకారం మరింత బలపడిందన్నారు మోదీ. ఇరు దేశాల మధ్య సమస్యలను.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సున్నితంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామన్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా రెండు దేశాలూ ఆర్థికంగా శక్తిమంతంగా అవతరించాయని చెప్పారు మోదీ.
మోదీ ఆతిథ్యానికి జిన్‌పింగ్ ఫిదా
ప్రధాని మోదీ ఆతిథ్యం గొప్పగా ఉందని ప్రశంసించారు జిన్‌పింగ్. ఈ పర్యటన జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. మోదీతో స్నేహ పూర్వకంగా సాగిన చర్చల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు.
జిన్‌పింగ్‌కు మోదీ గిఫ్ట్
హోటల్లో ఏర్పాటు చేసిన కళాఖండాలు, చేనేత వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు మోదీ, జిన్‌పింగ్. చైనా అధ్యక్షుడికి ఆయన చిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన శాలువాను బహుమతిగా ఇచ్చారు ప్రధాని.
ఇదీ చూడండి: సాగర తీరాన నరేంద్రుడి 'స్వచ్ఛభారత్'