మహాత్మాగాంధీ 'హింద్ స్వరాజ్' భావజాలంపై రూపొందిన పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ జనవరి 1న ఆవిష్కరించనున్నారు. 1909లో 'హింద్ స్వరాజ్'పై గాంధీజీ రాసిన కథనాల ఆధారంగా 'మేకింగ్ ఆఫ్ ఏ హిందూ పేట్రియాట్: బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ గాంధీజీ హింద్ స్వరాజ్' అనే పుస్తకాన్ని రచించారు జేకే బజాజ్, ఎండీ శ్రీనివాస్‌లు. 'హింద్ స్వరాజ్' భావజాలం ఎలా విస్తరించిందో ఈ పుస్తకంలో తెలిపారు. గాంధీజీ నిజమైన హిందూ దేశభక్తుడిగా ఎలా నడుచుకున్నారో వివరించారు.
'తాము ఈ పుస్తకంలోని ప్రతి కథనాన్ని గాంధీజీ సొంత మాటల్లోనే చెప్పామని' సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ తెలిపారు. గాంధీజీ ఎల్లప్పడూ తనను తాను గొప్ప హిందువుగా అభివర్ణించుకునే వారని వివరించారు. హిందూ అంటే అర్థం ఏంటి? హిందువుకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి? తదితర అంశాలపై గాంధీజీ రాసిన వాటిని ఇందులో అందించామన్నారు. అంతేకాక పాశ్చాత్య నాగరికత, భారత నాగరికతల మధ్య అంశాలపై గాంధీజీ చేసిన అధ్యయనాలను ఇందులో వివరించామన్నారు.
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులతో పాటు భాజపా నాయకులను ఆహ్వానించామని హర్-ఆనంద్ పబ్లికేషన్ ఛైర్మన్ నరేంద్ర కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి : మోదీ ధరించిన 'ఫెరాన్'.. రైతు కూలీ కానుక