శ్రీనగర్ సరిహద్దు సహా నగరంలో దాదాపు 24 మంది ఉగ్రవాదులు బహిరంగంగానే స్థానికులను బెదిరిస్తూ.. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరగాడుతున్నారని తెలిపారు.
బంద్ పాటించేలా ఒత్తిడి..
భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండే రాజ్‌బాగ్, జవ్‌హార్ నగర్, లాల్‌చౌక్‌లలోని దుకాణ యజమానులపై తుపాకులు గురిపెట్టి పూర్తిగా బంద్ పాటించేలా ఒత్తిడి తీసుకువస్తున్నారని అధికారులు వెల్లడించారు. దుకాణాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను బంద్ చేసేలా బెదిరిస్తున్నారని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు అంచార్ సరస్సు సరిహద్దు ప్రాంతాలను సైతం ఉగ్రవాదులు దిగ్బంధించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం వారి కదలికలు గుర్తిస్తున్నామన్నారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని జమ్ము కశ్మీర్ పోలీసు చీఫ్ డిల్బగ్ సింగ్ అన్నారు. అయితే ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారనడం సరికాదన్నారు.
ఉగ్రచర్యలకు అవకాశం..
2000 సంవత్సరం నుంచి శ్రీనగర్‌లో నిర్బంధ తనిఖీలతో పాటు ఆంక్షలను ఎత్తివేశామని.. 2012 నుంచి ఉగ్రవాద రహిత ప్రాంతంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు తగ్గాయన్నారు. షోపియాన్‌లో ఓ వాహన రిపేర్ షాప్‌ను ఉగ్రవాదులు తగలబెట్టారని.. ఇదే క్రమంలో తాజాగా భారీ ప్రణాళికతో తెగబడవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఉపయోగించుకొని ఎలాంటి విపత్కర పరిణామాలకు పాల్పడకుండా భద్రతా దళాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: '2,050 సార్లు.. 21 మంది మృతి.. కవ్విస్తున్న పాక్'