కొవిడ్ నేపథ్యంలో కఠిన నిబంధనలతో నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష-'నీట్'కు దాదాపు 90 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు తెలుస్తోంది. 15.97 లక్షల మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు హాజరైన వారి సంఖ్య 85-90 శాతం మధ్య ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంచనా వేసింది. అయితే అధికారిక గణాంకాలు అందుబాటులోకి రాలేదని వెల్లడించింది. 2019లో నీట్ హాజరు శాతం 92.9 శాతంగా ఉంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ధన్యవాదాలు తెలిపారు. పరీక్షకు ఇంతమంది విద్యార్థులు హాజరు కావడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు.
"నీట్‌కు 85-90 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఎన్టీఏ తెలిపింది. విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్టీఏకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు."
-రమేష్ పోఖ్రియాల్, కేంద్ర విద్యా శాఖ మంత్రి
కరోనా పాజిటివ్‌గా తేలిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు మరో అవకాశాన్ని కల్పించనున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి పరీక్ష తేదీలు ప్రకటించనున్నారు.