భారత్‌లో టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 16న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ 13 రోజూ విజయవంతంగా జరిగింది. గురువారం ఒక్కరోజే దాదాపు 5లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. రాత్రి 7 గంటల వరకు 4,91,615 మందికి టీకా అందించినట్లు తెలిపారు.
తాజా గణాంకాలతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28,47,608 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీ నుంచి 1,70,910 మంది, తెలంగాణ నుంచి 1,46,665మంది టీకాలు అందుకున్నారు. 13 రాష్ట్రాల్లో లక్షకు మించి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 2,84,979 మందికి టీకా అందించగా.. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, బెంగాల్, ఏపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, హరియాణా, బిహార్, కేరళ నిలిచాయి.