ఇటీవల ముగిసిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్. 147 స్థానాలున్న శాసనసభలో 112 సీట్లు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2000 సంవత్సరం నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ రికార్డు స్థాయిలో ఐదోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఒడిశాలో ముఖ్యమంత్రితో కలిపి మంత్రిమండలి పరిమితి 21. ఉదయం 10.30 గంటలకు ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభం కానున్న కార్యక్రమంలో పట్నాయక్ సహా మొత్తం 21 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రివర్గంలో ఈ సారి కొత్తగా 10 మందికి అవకాశం కల్పించారు పట్నాయక్. 11 మంది కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. భువనేశ్వర్‌లో ప్రమాణస్వీకారం చేసేముందు జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు బీజేడీ అధ్యక్షుడు.
వరుసగా ఐదోసారి....
2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో అధికారంలోనే కొనసాగుతోంది బిజు జనతా దళ్. 2000, 04, 09, 14లలో ముఖ్యమంత్రి పట్నాయకే. నేడు ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించారు పట్నాయక్. అయితే.. ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోదీ సుముఖంగా లేరని పార్టీ వర్గాల సమాచారం.
ఒడిశా అసెంబ్లీలో భాజపా 23 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బిజు జనతాదళ్‌కు గట్టిపోటీనిచ్చింది కాషాయ పార్టీ. 21 స్థానాల్లో బీజేడీ 12, భాజపా 9 చోట్ల విజయం సాధించాయి.