భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఈ ఘటనలో భారత సైనికుల మరణం దేశ ప్రజల మనోభావాలను గాయపరిచిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ ప్రయోజనాల కంటే మరేదీ ముఖ్యం కాదన్న హామీని ప్రభుత్వం ఇవ్వాలన్నారు ప్రణబ్. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను వెంటనే కట్టడి చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారాలను అన్వేషించాలన్నారు. లద్దాఖ్ ప్రతిష్టంభన జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలనే కాకుండా, ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిణామాలపై కూడా ప్రభావం చూపుతుందన్నారు.
"సరిహద్దులో సైనికులను కోల్పోవడం వల్ల దేశ ప్రజల మనస్సాక్షి దెబ్బతిన్నది. ఏకాభిప్రాయం ద్వారా ప్రస్తుత సమస్యను పరిష్కారించాల్సిన అవసరం ఉంది. భద్రతాబలగాల సహకారంతో ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది."
-ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి
సోమవారం రాత్రి గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా సరిహద్దులో ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా మాత్రం మరణాల లెక్కపై నోరు మెదపలేదు.
ఇదీ చూడండి: 'బొగ్గు గనుల వేలంతో స్వయం సమృద్ధికి తొలి మెట్టు'