హరియాణా ముఖ్యమంత్రిగా భాజపా నేత మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా జననాయక్ జనతాపార్టీ నేత దుష్యంత్ చౌతాలా ప్రమాణం చేస్తారు.
ఏకగ్రీవ ఎన్నిక
కొత్తగా ఎన్నికైన హరియాణా భాజపా ఎమ్మెల్యేలు.. శాసనసభా పక్షనేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖట్టర్ పేరును శాసనసభ్యులు అనిల్ విజ్, ఖన్వర్ పాల్ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలు బలపరిచారు. హరియాణా భాజపా వ్యవహారాల పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు.
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఖట్టర్.. భాజపా నేతలు, జననాయక్ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలాతో కలిసి గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యతో సమావేశమయ్యారు. తమ పార్టీ మద్దతు లేఖను దుష్యంత్ చౌతాలా గవర్నర్‌కు సమర్పించారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని భాజపా, జేజేపీ నేతలను గవర్నర్ ఆహ్వానించారు.
ప్రమాణ స్వీకారానికి అతిథులు వీరే
మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారోత్సవానికి భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు జైరామ్ ఠాకూర్, త్రివేంద్ర సింగ్ రావత్, యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
డిప్యూటీ సీఎంగా దుష్యంత్...
దుష్యంత్ చౌతాలా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ఆయన తల్లిదండ్రులు అజయ్ చౌతాలా, నైనా చౌతాల హాజరయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో అజయ్ చౌతాలా ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ఆయనకు రెండు వారాల పాటు పెరోల్ లభించింది. నేడు జైలు నుంచి బయటకు రానున్నారు.
2014లో ఖట్టర్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్కే అడ్వాణీ, అమిత్‌షా, భాజపాకు చెందిన పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: నవాజ్ షరీఫ్‌కు గుండెపోటు... ఆందోళనలో కుటుంబం!