కేరళ కోచిలో ముథూట్ ఫైనాన్స్ సంస్థ ఎండీపై దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటనలో ఎండీ జార్జ్ అలెగ్జాండర్ తలకు బలమైన గాయమైంది. ఘటనకు కారణమైన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
బంగారం తాకట్టుతో రుణాలిచ్చే ముథూట్... గత నెల కేరళలోని వేర్వేరు శాఖలకు చెందిన 160 మంది ఉద్యోగులను తొలగించింది. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘమైన సీఐటీయూ నేతృత్వంలో మాజీ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండీ అలెగ్జాండర్ కారుపై రాళ్లు విసిరారు కొందరు ఆగంతుకులు. "దాడి వెనక సీఐటీయూ గూండాలు ఉన్నారు" అని ఆరోపించింది ముథూట్.
అయితే ఘటనకు ఉద్యోగులు కారణం కాదని అభిప్రాయపడ్డారు ఆ రాష్ట్ర కార్మికమంత్రి. ఉద్యోగులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరి మారితే అంతా సమసిపోతుందని వ్యాఖ్యానించారు.
ఘటనపై సీఐటీయూ కూడా వివరణ ఇచ్చింది. హింసాత్మక ఉద్యమాలకు తాము దూరమని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: మరోసారి పాక్ మిడతల దండయాత్ర- రైతులు హడల్