ముంబయి.. దేశ ఆర్థిక రాజధాని.. 24 గంటలూ బిజీగా ఉండే ప్రాంతం. గత కొన్ని నెలలుగా ఈ మహానగరం కొవిడ్‌తో వణుకుతోంది. ఈ ఒక్క నగరంలోనే నమోదైన కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. అయితే ఇక్కడ కేసుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ.. అంతే స్థాయిలో రికవరీ రేటు ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. ఇక్కడ కోలుకుంటున్న వారు 70 శాతానికి పెరగ్గా.. ఇది జాతీయ సగటు కంటే 7 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
మహారాష్ట్రతో పోల్చినా.. ముంబయిలో రికవరీ రేటు 15 శాతం ఎక్కువే. జూన్ మధ్య కాలంలో ముంబయిలో రికవరీ రేటు 50 శాతం. కరోనా కట్టడి కోసం స్థానిక యంత్రాంగం చేపట్టిన 'మిషన్ జీరో' కార్యక్రమంతో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జులై 1 నాటికి రికవరీ రేటు 57 శాతానికి చేరగా.. 15 నాటికి 70 శాతానికి పెరిగింది. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో చేపడుతున్న చర్యలను డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రశంసించింది. అక్కడా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ముంబయిలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న వారు 24,307 మంది కాగా.. 67,830 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటివరకూ మహానగరంలో 98,979 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 5,582గా ఉంది.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: 'సైకిల్'కు ఇక స్వర్ణ యుగమే!