మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇళ్లల్లోంచి బయటికి వచ్చే పరిస్థితులు లేకుండా వరద నీరు రోడ్లపైకి భారీగా చేరింది. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. వేర్వేరు ఘటనల్లో వర్షాల ధాటికి మృతిచెందిన వారి సంఖ్య ముంబయిలోనే 36కు చేరింది.
గత ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి రైల్వేస్టేషన్లలోకి భారీగా నీరు చేరి.. పలు రైళ్లు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించక విమాన సర్వీసులూ ఆలస్యంగా నడుస్తున్నాయి.
పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిథి నది ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా.. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
మలాడ్లో 22 మంది...
తూర్పు మలాడ్ ప్రాంతం వద్ద గోడ కూలిన ఘటనలో 22 మంది మరణించారు. 70 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. పుణెలో కళాశాల గోడ కూలి.. ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఠానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో వర్షాల ప్రభావంతో ముగ్గురు మృతిచెందారు.
3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబయి వీధులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. తప్పనిసరి అయితే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది ప్రభుత్వం. ఎయిర్ ఇండియా కాలనీలో ఆస్తమాతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని రక్షించింది అగ్నిమాపక యంత్రాంగం. జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు చేపడుతోంది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.