ప్రశ్నాపత్రంలో ‘గ్యాంబ్లింగ్’ అనే పదానికి బదులు ‘గాంధీజీ’ అనే పదాన్ని ప్రచురించి విద్యార్థులను గందరగోళానికి గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్ర విద్యా మండలి పదో తరగతి విద్యార్థులను తుది పరీక్షల కోసం సిద్ధం చేసేందుకు చదువులో వెనకబడిన విద్యార్థులకు 45 నిమిషాల మోడల్ టెస్ట్ పేపర్‌ను అందించింది.
ఇందులో ‘సుబుద్ధి(సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి), కుబుద్ధి’(బుద్ధిహీనుడు) వ్యక్తి లక్షణాల గురించి వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన జవాబులో తప్పుగా ముద్రించారు. 'కుబుద్ధి' అనే వ్యక్తి లక్షణాలు అంటూ దుర్మార్గుడు, మద్యపానం, గ్యాంబ్లింగ్(జూదం)తోనే జీవితం సాగించాడు అని ఉండాలి. ఇక్కడ గ్యాంబ్లింగ్‌కు బదులు అక్కడ గాంధీజీ అని ముద్రించారు. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ.. భాజపా ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల పార్లమెంట్లో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే ఇలా జరగడం గమనార్హం.
దర్యాప్తునకు ఆదేశించాం...
మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రభురాం చౌదరి ఈ ఘటనపై స్పందించారు. దర్యాప్తునకు ఆదేశించామని, దోషులను తప్పక శిక్షిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: గాంధీ ఎలా 'ఆత్మహత్య' చేసుకున్నారో మీకు తెలుసా?