లోక్సభ సమావేశాలు రికార్డు స్థాయిలో నడిచాయని కొనియాడారు స్పీకర్ ఓం బిర్లా. 1952 నుంచి ఇప్పటివరకు 17వ లోక్సభ తొలి సమావేశాలు అత్యంత ఉత్పాదకత సమావేశాలుగా అభివర్ణించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు.
పార్లమెంట్ సమావేశాలు జూన్ 17న ప్రారంభమయ్యాయి. జులై 26తో ముగించాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. కొన్ని కీలక బిల్లులు ఆమోదింపజేసేందుకు సభను ఆగస్టు 7 వరకు పొడిగించారు.
36 బిల్లులకు ఆమోదం..
లోక్సభ సమావేశాలు 37 రోజుల్లో 280 గంటల పాటు నడిచాయి. ఇందులో 36 బిల్లులు ఆమోదం పొందాయి. మరో 33 బిల్లులు సభ ముందుకు వచ్చాయి. సాయంత్రాల్లోనూ సుమారు 75 గంటల పాటు సభ అదనంగా నడిచింది. శూన్యకాల సమయంలో 1,086 సమస్యలు లేవనెత్తారు సభ్యులు. ఇందులో 229 మంది తొలిసారి ఎన్నికైన వారే మాట్లాడారు. 42 మంది మహిళా ఎంపీలు సమస్యలపై గళమెత్తారు.
కీలక బిల్లులు...
లోక్సభ సమావేశాల్లో ముమ్మారు తలాక్, పోక్సో చట్ట సవరణ, వినియోగదారుల రక్షణ, ఎన్ఎంసీ, దివాలా చట్ట సవరణ, జమ్ముకశ్మీర్ హోదా, విభజన వంటి కీలక తీర్మానాలు, బిల్లులకు ఆమోదం లభించింది.
ఇదీ చూడండి: నిఘా నీడలో కశ్మీర్.. స్తంభించిన జనజీవనం