మానవుడి ఆశకు ఈ శతాబ్దంలో భారీ సంఖ్యలో అరుదైన పులులు మృత్యువాతపడ్డాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2,300కి పైగా పులులు బలయ్యాయని ట్రాఫిక్ అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమ సంస్థ తన నివేదికలో తెలిపింది. అంతరించిపోతున్న జీవుల వ్యాపారంపై జరిగిన జెనీవా సదస్సులో ఈ నివేదికను సమర్పించింది.
2000 నుంచి ఈ సంఖ్య మరీ ఎక్కువగా పెరిగిందని 'ట్రాఫిక్' ఆగ్నేయాసియా వ్యవహారాల సారథి కృష్ణమూర్తి నివేదించారు. గత సగటు కన్నా ఎక్కువగా ఏటా 120 పులులను బలి తీసుకున్నట్లు తెలిపారు. ఈ గణాంకాలను చూస్తే పులుల మనుగడ ప్రమాదంలో ఉన్నట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు.
"మనం ఈ యుద్ధంలో ఓడిపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 1900లో లక్షకు పైగా పులులు ఉండేవి. 2010 వచ్చే సరికి వాటి సంఖ్య రికార్డు స్థాయిలో 3,200కు పడిపోయింది. అప్పటి నుంచి కొద్దిమేర సంఖ్య పెరుగుతూ 3,900కు చేరుకుంది. ఇందుకు కారణం వాటి చర్మం, ఎముకలకు భారీ డిమాండ్ ఉండడమే. దీని గురించి మాట్లాడే సమయం లేదు. మన ముందున్న కర్తవ్యం ఈ హత్యలను నియంత్రించడమే."
-కనితా కృష్ణసామి, ట్రాఫిక్ సంస్థ ఆగ్నేయాసియా వ్యవహారాల సారథి
"2000 సంవత్సరం నుంచి గమనిస్తే 32 దేశాల్లో 2,359 పులులు అక్రమ రవాణా బారినపడ్డాయి. చర్మం కోసం ఏటా 58 పులుల ఉసురు తీస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో పులుల అక్రమ వ్యాపారం విపరీతంగా పెరిగింది" అని నివేదిక తెలిపింది.
ఇదీ చూడండి: వన భారతం: ఐదేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు