రాహుల్ గాంధీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ముందుగా గౌరీగంజ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మున్షిగంజ్ ఆయుధ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలో ప్రధాని మోదీ పర్యటించడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో మాత్రం గత డిసెంబర్లో మోదీ పర్యటించారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోట అయిన అమేఠీలో మోదీ పర్యటన భాజపా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తున్నారు.
2014లో..
2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ గాంధీపై భాజపా అభ్యర్థిగా స్మృతీ ఇరానీ పోటీ చేశారు. ఆమెకు మద్దతుగా అమేఠీ లోక్‌సభ నియోజకవర్గంలో మే 5న మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో స్మృతి ఓడినా... సుమారు 3 లక్షల ఓట్లు సాధించారు.
భాజపా ఆశలు
2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమేఠీ పరిధిలోని ఐదు స్థానాల్లో భాజపా 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఎస్పీ 1 స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఫలితాలు భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి.
ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరలా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని స్మృతీ ఇరానీ భావిస్తున్నారు. ప్రస్తుతం మోదీ అమేఠీ పర్యటన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుందని భాజపా ఆశిస్తోంది.