గుజరాత్లోని సూరత్- సౌరాష్ట్ర మధ్య రోపాక్స్ ఫెర్రీ(ఓడ ప్రయాణ) సేవలను ప్రారంభించిన సందర్భంగా.. ఆన్లైన్ వేదికగా అక్కడివారితో ముచ్చటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో ఓ వ్యాపారిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంతకి అసలేం జరిగింది?
వ్యాపారి నిర్లక్షంపై..
రవాణా వ్యాపారి అయిన సోలంకి.. తన దగ్గర ఉన్న డ్రైవర్లకు ఎక్కువ పని చెబుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మోదీ.. అది తప్పు అని, అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
సోలంకి- సమస్తే మోదీ జీ..
మోదీ- నమస్తే, మీరు ఏం చేస్తారు?
సోలంకి- నేను ఓ రవాణా వ్యాపారిని. మీరు ప్రారంభించిన ఈ ఓడల ప్రయాణంతో రవాణా సమయంతో పాటు దూరం కూడా తగ్గుతోంది. ఇప్పుడు మా డ్రైవర్లకు సేద తీరడానికి సమయం దొరుకుతుంది.
మోదీ- మీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు?
సోలంకి- ఎనిమిది మంది డ్రైవర్లుగా చేస్తున్నారు.
మోదీ- మీ వద్ద ఎన్ని వాహనాలు ఉన్నాయి?
సోలంకి- ఆరు ట్రక్కులు ఉన్నాయి.
మోదీ- ఇది చాలా దారుణం. మీ దగ్గర కనీసం 12 మంది అయినా ఉండాలి.
సోలంకి- అవును సార్.
మోదీ- వారి నుంచి మీరు చాలా సంపాదిస్తున్నారు. ఇలా చేయడం భావ్యం కాదు.
సోలంకి: లేదు సార్ ఇప్పుడు మీరు ప్రారంభించిన సర్వీసు వల్ల ఎక్కువ మంది అవసరం ఉండదు.
మోదీ: మీరు ఎక్కువ మంది డ్రైవర్లకు పని కల్పించడం ద్వారా వారికి పని భారం తగ్గుతుంది. లేకపోతే వారికి నిద్ర తక్కువ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రమాదం జరిగితే మీరు సంపాదించింది అంతా వృథా అయిపోతుంది.
సోలంకి: సరే సార్. మీరు చెప్పినట్లు నడుచుకుంటాను.
మోదీ: కచ్చితంగా పాటించాలి. ఏదీ.. నాకు మాటివ్వండి.
సోలంకి: నిజంగా పాటిస్తాను సర్. ఒట్టు. త్వరలో మరికొంత మందిని ఉద్యోగంలోకి తీసుకుంటాను.
మోదీ: మీరు ఇంకా ఎక్కువగా ట్రక్కులను కొనుగోలు చేస్తానని చెప్పండి. మీ మీద ఐటీశాఖ ఏమీ రైడ్ చేయదులే(నవ్వుతూ...)
సోలంకి: తప్పకుండా సార్. ప్రయత్నిస్తాను.
మోదీ: ధన్యవాదాలు.
తగ్గనున్న ప్రయాణ సమయం..
నూతనంగా ప్రారంభించిన రోపాక్స్ ఫెర్రీ సేవలతో భావ్‌నగర్, సూరత్ మధ్య 375 కి.మీ మేర రహదారి దూరం తగ్గనుంది. సముద్రమార్గం ద్వారా కేవలం 90కి.మీ ప్రయాణిస్తే సరిపోతుంది. అంతేగాక 12 గంటల ప్రయాణం.. నాలుగు గంటలకు తగ్గనుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
మరెన్నో ఉపయోగాలు:
ఈ రోపాక్స్ ఫెర్రీ సేవలతో సమయం ఆదా అవ్వడం సహా ఇంధన ఖర్ఛులు తగ్గనున్నాయి. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పురోగమించడం సహా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవనుంది. ఈ మార్గంలో మూడు డెక్కలు కలిగిన ఓడలో 30 ట్రక్కులు, 100 ప్యాసింజర్ కార్లు, 500 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. అంతేగాక మరో 34 మంది ఆతిథ్య సిబ్బంది ఇందులో ఉంటారు.