ఉత్తర్‌ప్రదేశ్ ఔరయ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వలసకూలీల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదాన్ని ఓ ఘోర దుర్ఘటనగా పేర్కొన్న ఆయన.. యూపీ సర్కార్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందన్నారు.
"ఔరయ రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను."
- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
రాహుల్ గాంధీ... సంతాపం
ఔరయ రోడ్డు ప్రమాదంలో మరణించిన వలసకూలీల కుటుంబాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
నిర్లక్ష్యమే కారణం..
బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఘోరం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలసకూలీలు మరణించగా, 22 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. 50 మంది వలస కూలీలు రాజస్థాన్ నుంచి తమ స్వస్థలాలకు ట్రక్కులో తిరిగి వెళ్తుండగా దిల్లీ నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది.
ఇదీ చూడండి: మరో ఘోరం: సొంతగూటికి చేరేలోగా మృత్యు ఒడికి!