జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో భాజపా అగ్రనేతలు మంగళవారం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, పార్టీ సంసిద్ధతపై ఆ రాష్ట్ర కార్యవర్గంతో చర్చించనున్నారని తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, పార్టీ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘాన్ని కోరారు భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రాం మాధవ్.
కశ్మీర్ భాజపా నేతల ధీమా
కశ్మీర్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ వద్ద తగినంత సమయం ఉందని వ్యాఖ్యానించారు.
శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో రాష్ట్రం
భాజపా, పీడీపీ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి కశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇంతకు ముందు విధించిన రాష్ట్రపతి పాలన గడువు ఇటీవలె ముగియగా జులై 3న మరో ఆరు నెలల పాటు పొడిగించారు.
ఇదీ చూడండి: కర్ణాటకం సశేషం.. మళ్లీ సుప్రీం ముందుకు రెబల్స్!