భారత్-అమెరికా మైత్రిబంధం కలకాలం వర్థిల్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మోటేరా స్టేడియం నవ శకం ఆరంభానికి వేదికగా నిలుస్తోందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా అమెరికా అధ్యక్షుడి ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
అహ్మదాబాద్ మోటేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని మోదీ స్వాగతం ప్రసంగంతో ఆరంభించారు.
"భారత్-అమెరికా మైత్రిబంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం. గుజరాత్ మాత్రమే కాదు.. యావద్దేశం ట్రంప్‌కు స్వాగతం పలుకుతోంది. భారత్, అమెరికా ఎన్నో విషయాల్లో సారూప్యత కలిగి ఉన్నాయి.
భారత్-అమెరికా సంబంధాల్లో ట్రంప్ పర్యటన ఓ మైలురాయి. అమెరికా కోసం అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆలోచిస్తారు. అమెరికా పునర్‌వైభవం కోసం ఆయన కృషి ప్రపంచం మొత్తానికి తెలుసు.
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన అమెరికా కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇవాంకా ట్రంప్ భారత్‌కు వచ్చారు. గతసారి వచ్చినప్పుడు మళ్లీ రావాలని ఇవాంకా కోరుకున్నారు. ఇవాళ యావత్ ప్రపంచం ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి మంచి స్నేహితుడు"
- నరేంద్ర మోదీ, ప్రధాని