కరోనా వైరస్.. విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సంకల్పంతో ముందుకు రావాలన్నారు ప్రధాని మోదీ. మార్చి 22(ఆదివారం)న ప్రజలందరూ స్వయం ప్రకటిత కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వైద్యులు, మీడియా రంగ ప్రతినిధులు, పోలీసులు, డ్రైవర్ల సేవలను కొనియాడారు మోదీ. వ్యాధి సోకే అవకాశాలు ఉన్నా వీరందరూ జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని కీర్తించారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు.
జనతా కర్ఫ్యూ ముగిసే ముందు సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి గుమ్మాలు, కిటికీలు, బాల్కనీల్లో నిలబడి ఐదు నిమిషాల పాటు చప్పట్లు, గంటలు కొడుతూ వారి సేవలను గుర్తు చేసుకొవాలని ప్రజలను కోరారు మోదీ.
"డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, మీడియా కార్మికులు, సుదూర ప్రాంతాల వారిని ఏకం చేసే రైల్వే, బస్, ఆటో రిక్షా వ్యక్తులు, డెలివరీ బాయ్‌లు... వీరందరు వారి కోసం పనిచేయడం లేదు. దేశం కోసం పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీరు చేస్తున్న సేవ సాధారణమైది కాదు. మార్చి 22న ఇలాంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు, 5 నిమిషాల వరకు వారికి సంఘీభావం ప్రకటిద్దాం. చప్పట్లు కొట్టి, గంటలు మోగించి వారి పట్ల మన కృతజ్ఞత చాటుకుందాం."-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి