20వ శతాబ్దంలో దేశాన్ని నిర్మించాల్సిన బాధ్యతను ప్రజలు కాంగ్రెస్కు అప్పగిస్తే, వారు మాత్రం ఒక్క కుటంబానికే అధికారాన్ని పరిమితం చేశారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఈ ఎన్నికలు 21వ శతాబ్దంలో నవభారత నిర్మాణం కోసం జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
కర్ణాటక మంగళూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ కాంగ్రెస్ -జేడీఎస్లపై పదునైన విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలకు వారసత్వ రాజకీయాలే ఆదర్శమని ఆరోపించారు. రైతులకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందించే కేంద్ర 'కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని అమలు చేయకుండా కర్ణాటక ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు మోదీ.
" కాంగ్రెస్, జేడీఎస్, వారితో జతకట్టిన పార్టీలకు వారసత్వ రాజకీయాలే ఆదర్శం. వాళ్ల కుటుంబంలోని అందరికీ అధికారం కట్టబెట్టాలనేదే వారి తాపత్రయం. వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం వాళ్ల విధానం. అందరూ అభివృద్ధి సాధించాలనేది మా విధానం. వారు అవినీతి, అన్యాయాలకు నిదర్శనం. మేము పారదర్శకత, పనీతీరుకు నిదర్శనం. వాళ్లు సొంత పార్టీకి చెందిన విశిష్ట నేతలను తక్కువ అంచనా వేస్తారు. మేము ఒక ఛాయ్వాలాను కూడా ప్రధానిని చేయగలం. వాళ్ల హయాంలో పేదలు నిరుపేదలయ్యారు. మేము పేదరికాన్ని తగ్గించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం"
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.