ఉపగ్రహ వ్యతిరేక సాంకేతికతను భారత్ విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలను ఇస్రో మాజీ సారథి మాధవన్ నాయర్ అభినందించారు. ఏ-శాట్... అణుబాంబు తరహాలో ఆత్మరక్షణ కోసమేనని, ఇతరులపై ఉపయోగించమని చెప్పారు. ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్, ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణన్, రక్షణ రంగ నిపుణులు మిషన్ శక్తి విజయవంతంపై హర్షం వ్యక్తంచేశారు.
ఇది మహోన్నతమైనది. ఎందుకంటే మన ఉపగ్రహాలవైపు చూసేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయరు. భారత ఉపగ్రహాలపై దాడికి ప్రయత్నం చేయరు. ఇది మన సామర్థ్యం అవుతుంది. ఈ ప్రయోగం ఏ దేశానికీ వ్యతిరేకంగా కాదు. ఈ ప్రయోగం దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయటానికి ఉద్దేశించినది మాత్రమే.
- వీకే సారస్వత్, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్
ఇది భారత అంతరిక్ష, క్షిపణి చరిత్రలో మరో కీర్తిపతాకం. రాజకీయ చిత్తశుద్ధితో ఇలాంటి నిర్ణయం తీసుకొని, తక్కువ సమయంలోనే ప్రయోగించినందుకు ప్రధానమంత్రికి అభినందనలు.
- మాధవన్ నాయర్, ఇస్రో మాజీ ఛైర్మన్
ఈ మిషన్ కోసం చాలా కష్టపడ్డ ప్రతి ఒక్క శాస్త్రవేత్తను అభినందించాలి. ఇది దేశాన్ని మరో కొత్త పోటీలో నిలబెడుతుంది. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం.
- ధృవ్ కటోచ్, రక్షణ రంగ నిపుణలు