వలస కార్మికుల తరలింపునకు సంబంధించి సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి అఫడవిట్‌ను గురువారం దాఖలు చేసింది కేంద్రం. ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కూలీలను తరలించినట్లు తెలిపింది. కాలినడకన స్వరాష్ట్రాలకు వెళ్లే వారిని గుర్తించి వారి సమీప రైల్వేస్టేషన్లకు తరలించినట్లు పేర్కొంది.
వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై.. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా ఈ అఫిడవిట్‌ను కేంద్రం దాఖలు చేసింది.
అంతేకాకుండా వారికి కావాల్సిన ఆహారం, మంచి నీటి ప్యాకెట్లకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించినట్లు తెలిపింది. జూన్ 1 వరకు 1.63 కోట్ల ఆహార ప్యాకెట్లు, 2.10 కోట్ల మంచి నీటి ప్యాకెట్లు అందించినట్లు అఫిడవిట్లో పేర్కొంది కేంద్రం. వారి అవసరాలను బట్టి మందులు, చెప్పులు, బట్టలు, ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందించినట్లు సుప్రీంకు కేంద్రం వెల్లడించింది.
ప్రతి రంగంలో నిపుణుల సంప్రదింపులు, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అధికారులు తీసుకున్న సమష్టి నిర్ణయాల ఆధారంగా కూలీలకు సౌకర్యాలు అందించినట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం అందించిన వివరాలపై సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:పాక్‌లో రికార్డు కేసులు, మరణాలు.. న్యూయార్క్‌లో తగ్గుముఖం