మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పిటిషన్‌పై నేడు దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇదే వ్యాజ్యంపై ఈ నెల 17న విచారణ జరిపింది న్యాయస్థానం. వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసింది.
తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పటికీ కేంద్రం రాజకీయ కక్ష సాధింపుతో తనను అరెస్టు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు శివకుమార్. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా.. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కీలకంగా వ్యవహరించినందుకే కేంద్రం తనపై ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తోందని శివకుమార్ ఆరోపిస్తున్నారు.
గత నెలలో అరెస్టు
గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్ ఆరోపణలపై శివకుమార్ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది. పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉంచింది.
బెయిల్ కోసం ఇదివరకే ట్రయల్ కోర్టును ఆశ్రయించారు డీకే. అయితే, శివకుమార్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్న ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు ఆయన బెయిల్‌కు నిరాకరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కర్ణాటక మాజీ మంత్రి.