రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలు బయటతిరగకుండా విధించిన నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చింది కేంద్రం. రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. గుంపులుగా గుమికూడటాన్ని నియంత్రించడం, భౌతిక దూరం నిబంధనలను పటిష్ఠంగా అమలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
సరకు రవాణా యథాతథం..
అయితే రాత్రి కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలు, సరకు రవాణా వాహనాలు, బస్సులు, రైళ్లకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం. జాతీయ, రాష్ట్ర రహదారులపై సరకు రవాణా వాహనాలు, బస్సులు ఆపవద్దని చెప్పింది. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోందని.. ఇది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోందని పేర్కొంది.
ఇదీ చూడండి: భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు అందుకే!