ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఆగస్టు 5న రామమందిరం కోసం భూమిపూజ జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఎన్నో ఏళ్ల నాటి తన కల సాకారం అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు కరసేవకుడు 80 ఏళ్ల అన్ను భాయ్ సోంపుర.
గత 30 ఏళ్లుగా..
అయోధ్యలోని కరసేవకపురానికి దగ్గర్లోనే శ్రీ రామ మందిరం నిర్మాణ వర్క్‌షాప్ ఉంది. 1992లో శ్రీ రామ్ జన్మభూమి న్యాస్ సభ్యులు దీన్ని స్థాపించారు. అప్పట్నుంచి ఇక్కడ మందిరం కోసం రాళ్లు చెక్కుతున్నారు.
అయోధ్యలోని మందిరాన్ని దర్శించిన భక్తులు.. వర్క్‌షాప్‌ను కూడా సందర్శిస్తారు. దీనికి అన్ను భాయ్ సూపర్వైజర్. 50 ఏళ్ల వయసులో అయోధ్య మందిరం నిర్మాణం కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. ఇందులో భాగంగా 1990లో రామ మందిరం కోసం ప్లాన్ సిద్ధం చేశారు. వీటితో పాటు వర్క్‌షాప్‌లో స్తంభాలు, శిల్పాలు చెక్కే పనులనూ ఆయన పర్యవేక్షిస్తుంటారు.
ఊపిరితిత్తుల సమస్యలతో...
గత 30 ఏళ్లలో ఇద్దరు శిల్పకారులు వర్క్‌షాప్‌లోనే మృతిచెందారు. రెండూ సాధారణ మరణాలే. 2001లో ఒకరు, 2019లో మరొకరు చనిపోయారు. రాళ్ల నుంచి వచ్చే ధూళి కారణంగా సిబ్బందిలో కొంతమంది సిలికోసిస్ టీబీ బారిన పడ్డారు. మరికొందరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు.
చాలా రాళ్లు అవసరం...
ఇప్పటివరకు మందిరంలోని ఒక అంతస్తు కట్టడానికి సరిపడా రాతి స్తంభాలు మాత్రమే సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రెండో అంతస్తు కోసం రాళ్లను సిద్ధం చేస్తున్నారు. పాత మందిరంలో 1.75 లక్షల క్యూబిక్ అడుగుల మేర మాత్రమే రాతిని ఉపయోగించగా.. తాజాగా దాన్ని 3 లక్షల క్యూబిక్ అడుగులకు పెంచేశారు. అన్ని రాళ్లను రాజస్థాన్ నుంచే తెస్తున్నారు.
నిరంతరాయంగా పనిచేస్తూనే...
వర్క్‌షాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ వర్క్‌షాప్ మూతపడలేదని అన్నుభాయ్ చెప్పారు. ఆరంభంలో 50 మంది కళాకారులు పనిచేసేవారు. అయితే పని ఒత్తిడి పెరగడం వల్ల ప్రస్తుతం 150 మంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు.