సంచలనం సృష్టించిన ముంబై మెడికో ఆత్మహత్య కేసులో ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. పోస్ట్ గ్రాడ్యూయేషన్ చదువుతున్న గిరిజన విద్యార్థిని పాయల్ తాడ్వీని వేధించడం కారణంగానే ఆమె మే 22న ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా నిర్థరించారు. నేడు వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
మహిళా కమిషన్ జోక్యం
జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులను ఆదేశిస్తూ లేఖ రాసింది.
"జాతీయ మహిళా కమిషన్ మెడికో ఆత్మహత్య పట్ల విచారం వ్యక్తం చేస్తోంది. ఇది అత్యంత సున్నితమైన అంశం"
-రేఖా శర్మ, ఛైర్పర్సన్, జాతీయ మహిళా కమిషన్
ఆస్పత్రి యాజమాన్యానికి మహారాష్ట్ర మహిళా కమిషన్ లేఖ రాసింది. కేసు విషయమై తీసుకున్న చర్యల్ని నివేదించాలని లేఖలో పేర్కొంది.
మెడికో ఆత్మహత్యతో ర్యాగింగ్ వ్యతిరేక విభాగం
మెడికో విద్యార్థిని పాయల్ తాడ్వీ ఆత్మహత్యతో కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఘటనకు కారణమని ఆరోపణలెదుర్కొంటున్న ముగ్గురు వైద్యులను మహారాష్ట్ర వైద్యుల సంఘం విధుల నుంచి బహిష్కరించింది.