ప్రభుత్వ ఉద్యోగాలకు కారుణ్య నియామకాల్లో వివాహమైన కుమార్తె కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు. వివాహమైన కుమార్తెను అనర్హురాలిగా పరిగణించటం వివక్షాపూరితం, రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.
భువనేశ్వరి వి. పురానిక్ అనే వివాహిత మహిళ.. మరణించిన తన తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకాల్లో భాగంగా ఇచ్చేందుకు నిరాకరించటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారించిన జస్టిస్ ఎం.నాగ ప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కుమారుడికి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా కారుణ్య నియామకం కోరే హక్కు ఉన్నప్పుడు... కుమార్తె విషయంలో తేడా ఉండకూడదని స్పష్టం చేసింది. వివాహం అయిన కుమారులు మాత్రమే కుటుంబ సభ్యులుగా కొనసాగుతారనే ఆలోచనకు చట్టం తావివ్వకూడదని పేర్కొంది. నిబంధన 2(1)(ఏ)(ఐ), 2(1)(బీ), 3 (2)(సీ)లు రాజ్యాంగ విరుద్ధమని, కర్ణాటక సివిల్ సర్వీసెస్ (కారుణ్య నియామకాలు) నిబంధనలు-1996 నుంచి అవివాహితులు అనే పదాన్ని తొలగించాలని ఆదేశించింది.
పిటిషనర్ అభ్యర్థనను స్వీకరించి నెల రోజుల్లోపు సంబంధిత నియామక ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
కేసు ఏమిటి?
అశోక్ అదివెప్ప మదివాలా అనే వ్యక్తి బెళగావి జిల్లాలోని కుడచి గ్రామంలో ఏపీఎంసీ కార్యాలయంలో కార్యదర్శిగా పని చేసేవారు. ఆయన మరణించిన క్రమంలో తన కూతురు భువనేశ్వరి కారుణ్య నియామకాల్లో భాగంగా తండ్రి ఉద్యోగం కోసం 2017, మే 22న దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ విభాగం సంయుక్త డైరెక్టర్ ఆమె దరఖాస్తును తిరస్కరించారు. వివాహం అయినందున ఉద్యోగానికి అనర్హురాలిగా పేర్కొంటూ 2017, ఆగస్టు 8న ఆదేశాలు జారీ చేశారు. దాంతో కోర్టును ఆశ్రయించారు భువనేశ్వరి.
ఇదీ చూడండి: బాలల్లోనూ హై బీపీ.. భద్రం సుమా!