మణిపుర్ రాజకీయ పరిస్థితులు తమ రాష్ట్రంపై ప్రభావం చూపవని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యానించారు. మణిపుర్లో ఎన్పీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయంపై స్పందించిన సంగ్మా.. మేఘాలయలో అటువంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.
"మణిపుర్లో ఏర్పడిన పరిస్థితులు నాయకత్వానికి సంబంధించినవి. అందులోనూ ఇది వ్యక్తి కేంద్రీకృత సమస్య. ఈ ప్రభావం మేఘాలయపై ఏమాత్రం ఉండదు. ఈ శుక్రవారం జరిగే రాజ్యసభ ఎన్నికపైనా ఈ పరిస్థితుల ప్రభావం ఉండదు."
-కాన్రాడ్ సంగ్మా
మణిపుర్‌లోని 60 స్థానాలున్న అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28, భాజపా 21 సీట్లు సాధించాయి. ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 4, జన్‌శక్తి పార్టీ 1 స్థానాలు గెలిచాయి. వీటితో కలిపి భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీనికి భాజపాకు చెందిన బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేఘాలయలో భాజపా మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మేఘాలయ సేఫ్..
తాజా పరిస్థితులపై మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లోని మిత్ర పక్షాలతో చర్చించినట్లు సంగ్మా తెలిపారు. ఈ కూటమిలో భాజపా కూడా ఉంది. మణిపుర్లో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు సంగ్మా.
"మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నాయకత్వానికి సంబంధించిన సమస్యలే ప్రధాన కారణం. మా మంత్రుల నుంచి కొన్ని శాఖలకు లాక్కోవటం వల్ల సమస్య మొదలైంది. ఈ విషయాన్ని దిల్లీలోని భాజపా కేంద్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇద్దరు ఎన్పీపీ జాతీయ కార్యదర్శులను మణిపుర్ ఎమ్మెల్యేలతో చర్చలకు పంపాం."
- కాన్రాడ్ సంగ్మా
ఎన్పీపీ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మణిపుర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగానే కనిపిస్తోంది.