"ఇదొక గొప్ప విజయమని విపక్షాలు నమ్ముతున్నాయి. ఈ ధర్నా... ప్రజలకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గెలుపును అందించింది. సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించినందున ఈ దీక్షను ఇంతటితో విరమించాలని నిశ్చయించాము. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగానే సుప్రీం తీర్పు ఉంది. ఈ దీక్షను ఈరోజు ముగిస్తున్నాము. కానీ మా నిరసనలను దిల్లీలో కొనసాగిస్తాము."
-మమతా బెనర్జీ, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి.
కేంద్ర వ్యవస్థలను ఉపయోగించి ప్రజలను భాజపా బెదిరిస్తోందని ఆరోపించారు. సీబీఐపై తనకు అపార గౌరవముందని మమత వెల్లడించారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల ఆదేశాల మేరకు బంగాల్లో అలజడి సృష్టించిన సీబీఐ... అంతే వేగంగా ఇతర కేసులపైనా విచారణలు చేపట్టాలని విమర్శించారు.
అంతకుముందు...
ఆదివారం మొదలైన బంగాల్ వివాదం మూడో రోజూ కొనసాగింది. సీబీఐ దాఖలు చేసిన అభ్యర్థనను విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. సత్యాగ్రహం చేపట్టిన మమతకు విపక్షాల నుంచి మద్దతు పెరిగింది.
అరెస్టు వద్దు... విచారణ మాత్రమే: సుప్రీం
శారదా కుంభకోణం విచారణ కోసం సీబీఐకి సహకరించాలని కోల్‌కతా సీపీ రాజీవ్‌కుమార్‌కు ఆదేశించింది సుప్రీంకోర్టు. రాజీవ్‌ను అరెస్టు చేయకూడదని సీబీఐకి సూచించింది.
సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై బంగాల్ డీజీపీ, కోల్‌కతా సీపీకి నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.
సీబీఐ విచారణకు సహకరించాల్సిందే :సుప్రీం
తీర్పు ఇద్దరికీ అనుకూలమే!
సుప్రీం తీర్పును బంగాల్ ప్రభుత్వం, కేంద్రం పోటాపోటీగా స్వాగతించాయి. న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని... తీర్పు ప్రజాస్వామ్య విజయమని ప్రకటించారు మమత.
కేంద్రమంత్రి రవిశంకర్ బంగాల్ వివాదాన్ని రాజకీయం చేయాలనుకున్నా.. వారికి అత్యున్నత న్యాయస్థాన తీర్పుతో ఘోర పరాభవం తప్పలేదని దుయ్యబట్టారు.
మమత సత్యాగ్రహానికి మద్దతు...
మమత సత్యాగ్రహం మూడు రోజులు సాగింది. దీదీకి విపక్షాల నుంచి విశేష మద్దతు లభించింది. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కోల్‌కతా వెళ్లి మమతను కలిశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దీదీకి అండగా నిలిచాయి.
ఉభయసభల్లో అదే పరిస్థితి...
వరుసగా రెండో రోజు బంగాల్ వివాదం ఉభయసభలను కుదిపేసింది. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు ఏకమై ఉభయసభల్లో ఆందోళనలు చేపట్టాయి. గందరగోళం మధ్య రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. 2గంటలకు మొదలైనా పరిస్థితి సద్దుమణగక సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి. అనేక సార్లు వాయిదా పడింది.
రాజీవ్ కుమార్ పదేళ్ల ముందు...
పదేళ్ల ముందు మమత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ చేస్తున్నట్టు రాజీవ్‌కుమార్‌పై ఆరోపణలు చేసిన మమత... ఇప్పుడు అదే రాజీవ్‌కుమార్ కోసం కేంద్రంపై యుద్ధం చేయడం గమనార్హం.