కోల్‌కతాలో మంగళవారం భాజపా అధ్యక్షుడు అమిత్ షా రోడ్‌షోను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
బంగాల్లోని బషీర్హాట్ ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.
"దీదీ గూండాలు తుపాకులు, బాంబులతో విధ్వంసం సృష్టిస్తున్నారు. మమత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. ఈ కుటిల పాలనపై ప్రజలు ధైర్యంగా ఎదురు తిరుగుతారు. బంగాల్లో భాజపా ఎదుగుదల చూసి దీదీ భయపడుతున్నారు. అధికార దాహంతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పులను దేశమంతా గమనిస్తోంది.
రెండు రోజుల క్రితం నాపై ప్రతీకారం తీర్చుకుంటానని మమత శపథం చేశారు. నిన్న అమిత్ షా రోడ్ షోను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. మహిళలను జైలుకు పంపిస్తున్నారు. వాళ్లే మీకు తగిన గుణపాఠం చెబుతారు. ఒక చిన్న ఫొటో కోసం ఈ స్థాయిలో కోపాన్ని ప్రదర్శిస్తారా?"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: కోల్‌కతాలో అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లదాడి