పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం చిన్నారుల సంరక్షణ సెలవు(చైల్డ్‌కేర్ లీవ్)లు తీసుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. అయితే కేవలం తండ్రి ఉన్నవారికే(సింగిల్ మేల్ పేరెంట్) ఈ వెసులుబాటు వర్తిస్తుందన్నారు. భార్య చనిపోయిన, విడాకులు ఇచ్చిన తండ్రులు తమ బిడ్డల బాధ్యతలను చూసుకోవడానికి ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినా.. తగినంత ప్రచారం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
చిన్నారుల పాలన కోసం సెలవు తీసుకున్న ఉద్యోగులు సంబంధిత అధికారి ముందస్తు అనుమతితో తాను పనిచేస్తున్న కేంద్రాన్ని విడిచిపెట్టి పోవచ్చన్నారు జితేందర్. ఈ సెలవుల్లో ఉన్నప్పటికీ ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) ఉపయోగించుకోవచ్చని చెప్పారు. చిన్నారుల పాలనా సెలవులు తీసుకున్న వారికి తొలి 365 రోజుల్లో 100 శాతం జీతం వస్తుందని, తదుపరి రోజుల్లో 80 శాతం జీతం వస్తుందని పేర్కొన్నారు. పిల్లల 22 ఏళ్ల వయసు వరకే చిన్నారుల పాలనా సెలవును తీసుకోవాలన్న నిబంధనను దివ్యాంగ పిల్ల తల్లిదండ్రులకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.