కొత్త సంవత్సరాన్ని డైరీతో మొదలు పెడతాం. నువ్వు జీవితంలో నూరుశాతం నిజాలు చెప్పగలిగేది నీ మనసుతో మాత్రమే. ఎలాంటి అరమరికలూ లేకుండా ఆ మనసుకు అక్షర రూపం ఇచ్చే వేదిక డైరీయే. అందుకే మహాత్మాగాంధీ డైరీని అమూల్య సంపద అని చెప్పేవారు. డైరీ రాయడంలో ఆయనే మనందరికీ ఆదర్శం. 19 ఏళ్ల వయసులోనే డైరీ రాయడం ప్రారంభించారు. తొలినాళ్లలో.. ఆత్మశోధన కంటే ప్రపంచం గురించి ఎక్కువగా రాసేవారు. క్రమేపీ విషయాలను, శైలిని కూడా మార్చుకుంటూ వచ్చారు. రోజువారీ కార్యక్రమాలే కాకుండా అనేక తాత్విక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను కూడా రాసేవారు. డైరీ ఎంత ప్రయోజనకరమో 90 ఏళ్ల క్రితమే 'హరిజన్' పత్రికలో గాంధీజీ వివరించారు.
"నేను డైరీని అమూల్య సంపదగా భావిస్తాను. సత్యనిష్ఠ పట్ల ఆసక్తి ఉన్నవారికది గీటురాయిగా ఉపకరిస్తుంది. మనలో సోమరితనం చోటుచేసుకున్నా.. పనిని నిర్లక్ష్యం చేసినా.. ఆ సంగతి డైరీలో రాయాలి. మనలో నిజాయతీ ఉండాలి. లేకుంటే డైరీ రాయడం చెల్లని నాణెంలా మిగులుతుంది. దినచర్యలో సత్యం మాత్రమే రాసుకుంటే అది బంగారం కంటే విలువైనది అవుతుంది. దినచర్య రాసేందుకు నిశ్చయించుకున్న తర్వాత అందులో వైఫల్యం ఉండకూడదు. మన తప్పులను అందులో విధిగా రాయాలి. వాటిమీద ఎలాంటి వ్యాఖ్యలు అవసరం లేదు. విమర్శ అనేది వెనువెంటనే అనుసరించి ఉంటుంది. 'ఈ రోజు ఈ విషయంలో సహనం కోల్పోయాం', 'ఆరోజు ఫలానావారిని మోసగించాం'.. ఇలా రాస్తే చాలు. 'ఇకముందు ఇటువంటి తప్పులు చేయకూడదు' అని పేర్కొనాల్సిన అవసరం లేదు. ఇతరుల తప్పులను మన దినచర్యలో ప్రస్తావించడం మంచిదికాదు. తనను తాను సంస్కరించుకునేందుకు డైరీ ఎంతగానో ఉపకరిస్తుంది."-మహాత్మా గాంధీ