మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ 288 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు 63 శాతం ఓటింగ్ నమోదైంది.
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ముంబయిలో పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు.
బాలీవుడ్ తారాగణం...
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్ బాంద్రా(పశ్చిమ)లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మహారాష్ట్ర వాసులంతా భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు ఆమిర్.
జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్లు ముంబయి జుహు పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి, ఆయన భార్య, నటి లారా దత్తా, మాధురీ దీక్షిత్ బాంద్రాలో... రితీశ్ దేశ్‌ముఖ్, జెనీలియా దంపతులు లాథుర్లో ఓటు వేశారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, గోవిందా, హేమమాలిని, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, దీపికా పదుకొనే, అలనాటి నటి షబానా అజ్మీ, సన్నీ దేఓల్లు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాజకీయ ప్రముఖులు...
భార్య కాంచన్‌తో ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్... భార్య అమృత, తల్లి సరితతో కలిసి ఓటు వేశారు.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే... భార్య రష్మి, కుమారుడు ఆదిత్య, తేజస్‌లతో కలిసి బాంద్రా(తూర్పు) నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు ఆదిత్య ఠాక్రే. ఆయన ఒర్లి స్థానం నుంచి పోటీ చేశారు.
సచిన్ తెందూల్కర్... భార్య అంజలి, తనయుడు అర్జున్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు.
అభ్యర్థిపై దాడి..
ఎన్నికల వేళ అమరావతి జిల్లా మల్ఖెంద్లో కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్వాభిమాన్ పక్ష పార్టీ అభ్యర్థి దేవేంద్ర భుయార్పై దాడి చేశారు. కారులో వెళ్తుండగా ఆయనను అడ్డగించి.. బయటకు లాగి కారును తగులబెట్టారు.
గెలుపుపై ధీమా...
భాజపా-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటములు తమ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. మహారాష్ట్రలో తమదే గెలుపు అని విశ్వాసం వ్యక్తం చేశారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. ప్రజలు తమ పక్షానే ఉన్నారని... మరోసారి ఫడణవీస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ సారి రికార్డు విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 288 స్థానాల్లో మొత్తం 3 వేల 237 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. భాజపా 164, సేన 124 చోట్ల పోటీ చేశాయి. మరో కూటమిలో కాంగ్రెస్ 147, ఎన్సీపీ 121 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి.
అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరిపి... అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.