మహారాష్ట్రలో భాజపాను అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో.. కాంగ్రెస్- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) శివసేనతో చేతులు కలుపుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వీటిపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్.. శివసేనతో పొత్తు కుదుర్చుకునేది లేదని తేల్చిచెప్పారు.
"శివసేన నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహం మాకు లేదు. శివసేనతో కాంగ్రెస్ పొత్తు అనే అంశమే తెరపైకి రాకూడదు. సేన మా వద్దకు వస్తే.. మా హైకమాండ్‌తో చర్చిస్తాం. వారిదే తుది నిర్ణయం."
-- బాలాసాహెబ్, మహారాష్ట్ర పీసీసీ చీఫ్
శివసేనతో చేతులు కలిపే అంశాన్ని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కొట్టిపారేశారు. భవిష్యత్తు కార్యచరణపై కాంగ్రెస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
"ప్రజలు మమ్మల్ని విపక్షంలో కూర్చోమన్నారు. మేము ప్రజల ఆదేశాలను అంగీకరిస్తాం. అధికారం చేపట్టాలన్న ఆలోచనే మాకు లేదు."
---- శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు.
ఇక శివసేన మైత్రితో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. భాజపా-105, శివసేన- 56 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్- 44, ఎన్సీపీ- 54 సీట్లు దక్కించుకున్నాయి. ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన మెజారిటీ 145 సీట్లు. శివసేన మద్దతు లేకపోతే కాషాయ దళం అధికారం దక్కించుకునే అవకాశం లేదు.