జల తరంగాలతో సంగీతం పలికించగల ఏకైక మహిళా సంగీత విద్వాంసురాలు విదూశీ శశికళ దనీ. కర్ణాటక హుబ్బలికి చెందిన శశికళ 20వ ఏట నుంచే ఈ జల తరంగాలను సంగీతంగా మలచడం అలవరచుకున్నారు. ఆమె తండ్రి వాదాంగ్ మాస్టర్ జావా నుంచే ఈ విద్య అబ్బిందని ఆమె గర్వంగా చెప్పుకుంటారు. 33 ఏళ్లపాటు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా సేవలందించిన ఆమె.. సంగీతాన్ని మాత్రం వీడలేదు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
గ్వాలియర్ ప్రాంతంలోని గ్రహణ సంగీత పాఠశాలలో సంగీతం నేర్చుకున్న శశికళ బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్మోనియం, సితార, వయోలిన్, దిల్ రుబా తబలా వాయించడంలో ఆమెకు ఆమే సాటి. గాయకీ-తాంత్రకీ అంగాలను ఒంటబట్టించుకున్నారు. అద్భుత లయకారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
1982, 1985లో కర్ణాటక సంగీత నిత్య అకాడమీ తరఫున రెండు సార్లు స్కాలర్ షిప్ సొంతం చేసుకున్నారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ చందనలలోనే కాక.. కదంబోత్సవం, హంపీ వేడుకలు, ధార్వాడ్ వేడుకలు, పంచాక్షరి గవా పుణ్యతిథి వంటి ఎన్నో కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చారు. కర్ణాటక కళాశ్రీ, రాణీ చెన్నెమ్మ అవార్డు, జ్ఞాన గంగా వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.
సంగీతమే ఊపిరిగా..
జీవితం ఎన్ని మలుపులు తిరిగినా.. జలతరంగ వాద్యాలపై ఉన్న మక్కువను మాత్రం వీడలేదు శశికళ. జల తరంగ సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి.. చివరికి ప్రపంచ ప్రఖ్యాత విద్వాంసులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'స్వరనాద సంగీత విద్యాలయం' పేరిట ఓ సంస్థను స్థాపించి.. ఆన్లైన్ లో విదేశీ విద్యార్థులకూ జలతరంగ వాద్యాల విద్యను నేర్పుతున్నారు.
ఇదీ చదవండి: మీరు వినే సంగీతం.. వ్యక్తిత్వం తెలియజేస్తుంది!