దివాలా చట్ట సవరణ (రెండో సవరణ) బిల్లును స్థాయి సంఘానికి (స్టాండింగ్ కమిటీ) ప్రతిపాదిస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా నిర్ణయం తీసుకున్నారు. బిల్లును పరిశీలించాల్సిందిగా భాజపా ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని కమిటీకి సిఫార్సు చేశారు. మూడు నెలల్లో బిల్లుపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేబినెట్లో ఆమోదం పొందిన ఈ బిల్లును తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం.
మరో నాలుగు బిల్లులు
దివాలా సవరణ బిల్లుతో పాటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన మరోనాలుగు బిల్లులనూ వివిధ స్టాండింగ్ కమిటీలకు స్పీకర్ ఓంబిర్లా సిఫార్సు చేసిట్లు లోక్సభ సెక్రెటేరియెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పైరసీ వ్యతిరేక బిల్లు, శ్రామికుల సంక్షేమ బిల్లు సహా తల్లితండ్రులు, వృద్ధుల సంరక్షణ బిల్లులను వివిధ కమిటీలకు సిఫార్సు చేసినట్లు లోక్సభ పేర్కొంది.
సముద్ర దొంగలకు విధించే శిక్షలను కఠినతరం చేస్తూ ప్రవేశపెట్టిన సముద్ర పైరసీ వ్యతిరేక బిల్లునూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేశారు ఓంబిర్లా. ఈ బిల్లును డిసెంబర్ 9న విదేశాంగ మంత్రి జయ్శంకర్ లోక్సభలో ప్రవేశపెట్టారు.